Posts

జన్మ

అది విశ్వం చూపునావరించేది సూర్యుడూ, చంద్రుడే మళ్ళీ అందులో మరిన్ని విశ్వాలు అందందులో మరెందరో సూర్యచంద్రులూ సన్నని దారాలేవీ కనిపించవు ఒకదాన్నొకటి వదిలీపెట్టవు చీకటి పరుపుల సంద్రాలలోన నిండు చీకట్ల శూన్యాలపైన తిరుగుతూ తిరుగుతూ వేగంగా కదులుతూ అంతలోనే నిదురిస్తూ అంబిలికల్ కార్డుకు చుట్టుకుని, వస్తాడు శిశువు ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి తల్లి కడుపులోంచి ఇలా అనంతానంత విశ్వంలోకి (Congratulations Satti Babu and Divya)

//అనుకోకుండానే...//

Image
//అనుకోకుండానే...// *ఎక్కడికి పోయారు పిల్లకాయలంతా? **అయిందా స్నానం? టెర్రస్ మీదకెళ్లారు... ఆడుకోవడానికి. *వర్షం పూర్తిగా తగ్గిందో లేదో... **తగ్గిందిలే. మా వాళ్లు కొత్తగా స్కేటింగ్ నేర్చుకుంటున్నారుగా. నీ పుత్ర రత్నాలకి చూపిస్తామని ఒకటే గోల! *ఏంటి! వర్షిణికి కూడా నేర్పిస్తున్నారా!... **అవును. నాకిద్దరూ ఒక్కటే. *చూడ్డానికి అలా ఉంటుంది గానీ, పిల్ల బుద్ధిమంతురాలే లే. **నవ్వినప్పుడు ఎంత కళగా ఉంటుందో! నువ్వు సరిగా చూసినట్టు లేదు. *అవున్లే... ఇంతకీ ఆ అనాథాశ్రమం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా? **తీసుకొచ్చి ఆర్నెల్లవుతోంది కదా. ఇంకేముంటాయి! *ఎందుకంత సడెన్గా అటువంటి నిర్ణయం తీసుకున్నారక్కా! పోనీ అబ్బాయినైనా తెచ్చుకోవాల్సింది. **చూడగానే వర్షిణి నాకోసమే అక్కడున్నట్టినిపించింది. *ఐడియా నీదే అనుకుంటాగా... **అవును. నాకు పెళ్ళికి ముందరి నుండీ కోరిక, అలా ఎవరికైనా కొత్త జీవితాన్నివ్వాలని. మీ బావగారు ఓ పట్టాన ఒప్పుకుంటేగా. అందుకే ఇంత లేటయింది. *చిన్న పాపైనా బావుండేది. మరీ పదేళ్లంటే...అన్నీ తెలిసిపోయే ఏజ్ కదా? **ఇద్దరూ ఒక వయసు వాళ్ళైతే బావుంటుందని. *అయినా నువ్వు గ్రేటక్కా! అలా చూసుకోవడం అంత ఈజీ కాదు

Joker (2019) Movie Review

Image
ది డార్క్ నైట్ సినిమాతో అత్యంత ప్రజాదరణ పొందిన జోకర్ పాత్ర అసలు పుట్టింది 1940 లలోనే. డీసీ కామిక్స్ వారి బ్యాట్ మాన్ సిరీస్ లో జోకర్ మొదటిసారిగా కనిపిస్తాడు. తర్వాత ఎన్నెన్నో కామిక్, టీవీ సిరీస్ లలోనూ, సినిమాలలోనూ కనిపించిన ఈ జోకర్ పాత్ర, ఇప్పుడు తనదంటూ ఒక కథ చెబుతానని ఇలా 'జోకర్' సినిమాగా మన ముందుకొచ్చింది. నిజానికి ఈ సినిమాలోని జోకర్ పాత్ర మూలాలేవీ అంతకు ముందు వచ్చిన సిరీస్లలోని, సినిమాలలోని జోకర్లతో పెద్దగా కనెక్ట్ కావు. దీనికై ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకుంటే అర్థంచేసుకోవడం సులువవుతుంది. కథేమిటంటే...అది 1981వ సంవత్సరం. గోతమ్ అనే కల్పిత నగరం. ఆ కుర్రాడిని ఎప్పుడూ సంతోషంగా ఉండమని చెబుతుంది వాళ్ళమ్మ. అతని పేరు ఆర్థర్ అయినా హ్యాపీ అని పిలుస్తుంటుంది. తల్లంటే చాలా ఇష్టాన్ని కలిగి ఉన్న ఆర్థర్, ఆమె చెప్పినట్టే ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా స్టాండ్ అప్ కమెడియన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. 'హాహా' అనే, నవ్వుల్ని పంచడమే వృత్తిగా గల వ్యాపార సంస్థలో జోకర్ గా పనిచేస్తుంటాడు. కానీ, ఎందువల్లో ఈ సమాజం అతడిని చిన్నచూపు చూస్తుంది. దారుణంగా అవమానిస్తూ, శారీరకంగానూ

మో

Image
ఏ రోడ్ల మీద తిరిగాడో ఏ అరుగుల మీద కూర్చున్నాడో ఏ పరాయి పుర వీధుల్లో పచార్లు చేసాడో ఏ రైలు కిటికీలోకి నదిలా దూకి ప్రవహించాడో ఏ థియేటర్ సీటుకి వెన్నునొక్కిపెట్టి, తలల మీది పళ్లన్నీ చూపుల్తో గురిపెట్టి కొట్టాడో ఎన్నెన్ని నిగ్రహాల విగ్రహాల్ని ఏ లైబ్రరీ మూలల్లో ప్రతిష్ఠించి పూజించాడో ఏ బార్లో బాటిల్నో సాంబార్లో ఇడ్లీనో కుమ్మి కుమ్మి కవితలు చేసాడో ఎందరందగత్తెల వన్నెచిన్నెల్నో - వింజామరల్నో విశ్వమంతా విసిరి - విసిరి సేద తీరాడో ఎందరెందరు కవుల సమాధుల్ని తవ్వి తీసి ఎన్నెన్ని గుండెల వేళ్ళలోకి గుచ్చి గుచ్చి బ్రతికించాడో ఏ అక్షరాల తొక్కుడు బిళ్లల్ని విసిరి ఎన్ని దుమ్ము పొరల మెదళ్ళు దులిపి రేగ్గొట్టాడో ఎన్నిసార్లు సూరుడ్ని పొడిపొడిలా చితక్కొట్టి, ఏ మధ్యాహ్నం పూట - టీ పెట్టుకు తాగాడో ఎన్ని పొద్దున్నలు - చందమామను తరిమి తెచ్చి, ఏ కాఫీ కప్పుపైన వెన్నెల స్మైలీలు నొక్కి పిండాడో... ఏ వీధినీ ఉదయాన్నీ చూసినా ఏ కలనీ కన్నీటినీ మోసినా ఎక్కడో ఏ'మో'నని వెతుకులాటగానే ఉంది .

ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 2

సెల్సియస్ లలోని నీ సహనం, మరొకరి స్కేల్ మీద ఫారెన్ హీటు. కో'యెఫిషియంట్ల' కొలతల్లో కాస్త ముందుకో వెనక్కో, అంకెల సూత్రాలను చంకనేసుకుని మాత్రం, చుట్టూ సమాజం లోచన లోతూ, యోచన వైశాల్యమూ ఎవరిదెవరికి! రెండు రెట్ల బీటాగా, మూడు రెట్ల గామాగా - ఒక్కటే ఆల్ఫా మరిగి చల్లబడటాలు మనిషి గుణాలూను; మనసు థెర్మామీటర్లో నువ్వు మంచినీటివైనా, పాదరసానివైనా!

ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 1

ఏ యాంగిలైతే మునుగుతుందో కాపిలరీ ట్యూబ్! ఆత్మ - శూన్యంలోకి బుడుంగుమన్న చప్పుడు బయటకు లాగే బలమేదీ సరిపోదు, వ్యతిరేకంగా వొంటి భారమే దిగదీస్తుంటే. జీవపు సాంద్రత గల సరికొత్త ద్రవంలో, విస్కాసిటీ చురకత్తుల - అంతులేని అంతర్యుద్ధం పోయిజెయీలూ, స్టోక్లూ ఎన్ని తత్వాలైనా పాడనీ; దేహపు పాత్ర పగిలిపోతేనే ఇక, ప్రాణానికి ముక్తీ , విముక్తీ!

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం

Image
  నబొకొవ్ తన జీనియస్నీ, విస్తృతమైన వకాబులరీ నీ, చిక్కులు పడ్డ వాక్యాల్లో చుట్టబెట్టి అందిస్తే, జార్జ్ లూయీస్ బోర్హెస్ మాత్రం తన మేథో సంపత్తిని మిస్టిక్ గా, మ్యాజికల్ గా అక్షరీకరించాడు. ఈయన రచనలు చదవాలనుకున్నప్పుడు, ఫిక్సియోనిక్స్ కంటే లాబిరింత్స్ వైపుకే ఎక్కువగా మొగ్గు చూపాను. రెండింటిలోనూ నాకు నచ్చే మ్యాజిక్ రియలిజం ఎలానూ ఉంటుంది; అది ఇంకాస్త ఎక్కువ ఫిక్షనల్ గా ఉంటే, మరింత ఉత్సాహంగా చదవవచ్చన్నది నా ఆలోచన. కానీ ఈయన రచనల్లో అనేక తరహాలకు చెందిన సింబాలిక్ మీనింగ్స్ ఉంటాయని చదివే కొద్దీ అర్థమవుతోంది.  గొప్ప రచయితల జీవితాలెందుకు వారి రచనల కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయో తెలీదు. అలా ఆసక్తి కలిగించే విషయాలు బోర్హెస్ జీవితంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈయన రచనల్లో స్త్రీ పాత్రలు కనిపించవు. రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు గానీ అవి కేవలం కొన్ని (సాధారణం కాని) అవసరాలకు చెందిన ఒప్పందాలు మాత్రమే. మధ్య వయసులో అతను చూపును కోల్పోవడంతో, అప్పటివరకూ అతన్ని సంరక్షించి, లేదా కంట్రోల్ చేసిన అతని తల్లి, పెళ్లి ద్వారా బాధ్యతలను బదిలీ చేసే ప్రయత్నం చేసింది మొదటిసారి. ఆ బంధం ఎక్కువకాలం నిలవనే లేదు. రెండ