Joker (2019) Movie Review


ది డార్క్ నైట్ సినిమాతో అత్యంత ప్రజాదరణ పొందిన జోకర్ పాత్ర అసలు పుట్టింది 1940 లలోనే. డీసీ కామిక్స్ వారి బ్యాట్ మాన్ సిరీస్ లో జోకర్ మొదటిసారిగా కనిపిస్తాడు. తర్వాత ఎన్నెన్నో కామిక్, టీవీ సిరీస్ లలోనూ, సినిమాలలోనూ కనిపించిన ఈ జోకర్ పాత్ర, ఇప్పుడు తనదంటూ ఒక కథ చెబుతానని ఇలా 'జోకర్' సినిమాగా మన ముందుకొచ్చింది. నిజానికి ఈ సినిమాలోని జోకర్ పాత్ర మూలాలేవీ అంతకు ముందు వచ్చిన సిరీస్లలోని, సినిమాలలోని జోకర్లతో పెద్దగా కనెక్ట్ కావు. దీనికై ఇది ఒక ప్రత్యేకమైన పాత్ర అనుకుంటే అర్థంచేసుకోవడం సులువవుతుంది.
కథేమిటంటే...అది 1981వ సంవత్సరం. గోతమ్ అనే కల్పిత నగరం. ఆ కుర్రాడిని ఎప్పుడూ సంతోషంగా ఉండమని చెబుతుంది వాళ్ళమ్మ. అతని పేరు ఆర్థర్ అయినా హ్యాపీ అని పిలుస్తుంటుంది. తల్లంటే చాలా ఇష్టాన్ని కలిగి ఉన్న ఆర్థర్, ఆమె చెప్పినట్టే ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా స్టాండ్ అప్ కమెడియన్ కావాలని ప్రయత్నిస్తుంటాడు. 'హాహా' అనే, నవ్వుల్ని పంచడమే వృత్తిగా గల వ్యాపార సంస్థలో జోకర్ గా పనిచేస్తుంటాడు. కానీ, ఎందువల్లో ఈ సమాజం అతడిని చిన్నచూపు చూస్తుంది. దారుణంగా అవమానిస్తూ, శారీరకంగానూ, మానసికంగానూ కూడా హింసిస్తుంటుంది. దానికితోడు అతనికి కారణం లేకుండానే, ఆపుకోలేనంత నవ్వు వస్తుంటుంది. ఆ స్థితి నుండి బయటకు రావడానికి సైకియాట్రిక్ చికిత్స తీసుకుంటూ ఉంటాడు. అది పెద్దగా ప్రభావం చూపకపోవడం వల్ల, తీవ్రమైన మానసిక సంఘర్షణకు లోనవుతుంటాడు. మెల్లగా తన అసలు స్వరూపం అతనికి అర్థం కావడం మొదలవుతుంది. ప్రభుత్వ నిధులు రాక, చికిత్స కూడా ఆగిపోవడంతో, మందుల్లేకపోవడం వలన, అన్నాళ్ళూ లోతుగా లోపలి తొక్కిపెట్టబడిన అతని నైజం ఒక్కసారిగా పైకి ఎగదన్నుతుంది. తను స్కిజోఫ్రినిక్ అన్న విషయం కూడా అతనికి ఆ సమయంలోనే తెలుస్తుంది. దానికితోడుగా గతానికి చెందిన మరికొన్ని భయకరమైన నిజాలు కూడా బయటపడటంతో అతని మనసు పూర్తిగా దారి మళ్లుతుంది. అతనిలోని హింసాత్మక ప్రవృత్తి, కోరలు తెరుచుకుని గాండ్రిస్తుంది. 'తానంటూ ఒకడు నిజంగా ఉన్నాడా!' అని అతడు సందేహపడే స్థితి నుండి, ఒక వర్గం ప్రజల చేత దేవుడిలా ఆరాధింపబడే పరిస్థితి వస్తుంది. తనని బాధ పెట్టినవారిపైనా, చిన్నచూపు చూసినవారిపైనా, కట్టలు తెగిపడే సంతోషం తోడుగా - పగ తీర్చుకుంటాడు.
జోకర్ తత్వం - ఇతని ఫిలాసఫీకి నైతిక శూన్యవాదమనే (మోరల్ నిహిలిజం) పేరు పెట్టవచ్చు. ఇతనికంటూ కొన్ని ప్రత్యేకమైన నైతిక విలువలుంటాయి. అవి సమాజం దృష్టిలోని నైతిక విలువలకు భిన్నంగా ఉంటాయి. ఇతని ఆలోచనా ధోరణి, సమాజం ఏర్పరిచిన నియమాలకు వ్యతిరేకమైన సూత్రాలను ప్రతిపాదిస్తుంది. కానీ, చాలాకాలం పాటు, ఆ విషయం అర్థంకాక పోవడం వలన, తనకి మానసికమైన సమస్య ఉందని అతను నమ్ముతాడు. ఆపుకోలేకుండా అకారణంగా వచ్చే తన నవ్వును, మానసిక అనారోగ్యంగా భావిస్తాడు. కానీ అదే తన అసలు తత్వమనీ, సమాజం అడుగుజాడల్లో నడవడం తన శైలి కాదనీ తర్వాత అర్థం చేసుకుంటాడు. అందరూ 'మంచి' అని చెప్పేదే మంచి ఎందుకవ్వాలన్నదీ, అందరూ నవ్వే విషయాలకే ఎందుకు నవ్వాలన్నదీ అతడి ప్రాథమికమైన ప్రశ్నలు, మానవత్వాన్నీ, మంచితనాన్నీ మాత్రమే నైతిక విలువలుగా భావించే స్థాయి నుండి, మనుషుల ప్రాణాలు తీయడంలోని ఆనందాన్ని అనుభవించే స్థితికి అతడు చేరతాడు. తనను అవమానించిన వారినీ, తనకు కీడు చేసిన వారినీ మాత్రమే చంపడం మొదలుపెట్టినా, అది అతనిలోని ఉన్మాద స్థితికి చెందిన తొలి దశగానే కనిపిస్తుంది. తనకి ఆనందాన్నిచ్చేవేమిటో అతనికి అర్థమయ్యాకా, ఆగదనుకునే అతని నవ్వు కూడా అదుపులోకి వచ్చేస్తుంది. తనలోని సంతోషాన్ని చిన్నపాటి నాట్య భంగిమల ద్వారా కూడా వ్యక్తం చేస్తుంటాడు ఆర్థర్. నిజానికి ఆర్థర్, మొదటినుండీ చాలా సున్నితమైన మనసు కలిగినవాడిగానే కనిపిస్తాడు.హంతకుడిగా మారిన తర్వాత కూడా, తనని భాధ పెట్టిన విషయాలను తలుచుకున్నప్పుడు కళ్ళు తడి చేసుకుంటాడు. ఇదంతా చూస్తే, తన అసలు స్వరూపం, నియమాలూ వేరని అతను భావించడం కేవలం అతనిలోని ఉన్మాది సృష్టించిన భ్రమ మాత్రమే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
మెచ్చుకోదగ్గవి - 1. సినిమాలో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గది, ఆర్థర్ గా నటించిన వాకీన్ ఫీనిక్స్ నటన. ఇతడు ఈ జోకర్ పాత్ర కోసం ఇంచుమించు 24 కేజీల బరువు తగ్గాడట. బక్కచిక్కిపోయి, చర్మం, ఆస్థి పంజరానికి అంటుకుపోయినట్టుగా ఉన్న శరీరంతో కనిపిస్తూ అతను ప్రదర్శించిన హావ భావ ప్రకటనలు సామాన్యమైనవి కావు. ఆగకుండా వచ్చే అతని నవ్వే ఈ సినిమాలోని జోకర్ ఫిలాసఫీకి ఆయువు పట్టు. కనుక ఆ నవ్వుకు పూర్తి స్థాయిలో న్యాయం చెయ్యడంలో ఎటువంటి లోటూ చెయ్యలేదు వాకీన్. నరాలు తెగిపడినట్టుండే ఆ నవ్వు తాలూకూ ఉధృతిని మహా సముద్రంలా పొంగించాడతడు. వెలుగు నీడల మధ్యన పూర్తి నిడివిలో తన ముఖం మీదే కదలాడే కెమెరా కన్నుకు వంద శాతం తనని తాను అప్పగించుకున్నాడు. ఆనందాన్ని వ్యక్తపరిచే క్రమంలో అతడు ప్రదర్శించిన నాట్య భంగిమల స్టైల్, చూపరులను ఆకర్షణకు గురిచేసే విధంగా ఉంటుంది.
2. తర్వాత చెప్పుకోవాల్సింది నేపధ్య సంగీతం గురించి. ఈ సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను హిల్డర్ గువోనాడోట్టిర్ అందించారు. ఈమె సృష్టించిన సంగీతం 'ఆర్థర్ లోకి కరిగి కలిసిపోయిందా!' అనిపిస్తుంది. అతని నవ్వులానే, బాధనీ, సంతోషాన్నీ అది ఒకేసారి కేప్చర్ చేస్తుంది.
3. మూడోది ఎడిటింగ్. అంతగా కలవరపరిచే సన్నివేశాలనూ, ఆర్థర్ యొక్క తీవ్రత నిండిన హావభావాలనూ, లింక్ తెగకుండా, ఆసక్తి కలిగించే విధంగా అమర్చి పెట్టింది జెఫ్ గ్రాత్ ఎడిటింగ్.
4. సినిమాటోగ్రఫీ - 1980 ల కాలానికి తగినట్టుగా వెలుగులనూ, రంగులనూ సృష్టించి, అత్యంత నైపుణ్యవంతంగా కెమెరాను కదిలించాడు సినిమాటోగ్రాఫర్ లారెన్స్ షెర్.
బలహీనతలు - కథనాన్ని గాలి కూడా చొరబడనంత చిక్కగా అల్లినా, కథలోనే కొద్దిపాటి తడబాటు కనిపించింది. ఆర్థర్ ను, అమాయకత్వం నుండి హింస వైపుకూ, సెల్ఫ్ పిటీ నుండి శాడిజం వైపుకూ నడిపించే దర్శకుడి (టాడ్ ఫిలిప్స్) ప్రయత్నంలో స్పష్టత లోపించి, అతనేం చెప్పదలుచుకున్నాడన్న విషయంలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. జోకర్ తాలూకూ ట్రేడ్ మార్క్స్ అయిన, అతని వ్యంగ్య సందేశాలు లేకపోవడం కూడా ఒక లోటు.
ఆర్థర్ పూర్తి స్థాయి జోకర్ గా మార్పు చెందుతున్న సన్నివేశాలలో, థియేటర్ లో ఈలలు, అరుపులు వినిపించడం చూస్తేనే ఈ జోకర్ పాత్రకున్న క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాలోని ఆర్థర్, ది డార్క్ నైట్ సినిమాలోని జోకర్ గా పూర్తి స్థాయిలో మారకుండానే సినిమా ముగుస్తుంది. జోకర్ అభిమానులకు ఇది కొంత నిరాశను కలిగించవచ్చు.

Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం