లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం

 
నబొకొవ్ తన జీనియస్నీ, విస్తృతమైన వకాబులరీనీ, చిక్కులు పడ్డ వాక్యాల్లో చుట్టబెట్టి అందిస్తే, జార్జ్ లూయీస్ బోర్హెస్ మాత్రం తన మేథో సంపత్తిని మిస్టిక్ గా, మ్యాజికల్ గా అక్షరీకరించాడు. ఈయన రచనలు చదవాలనుకున్నప్పుడు, ఫిక్సియోనిక్స్ కంటే లాబిరింత్స్ వైపుకే ఎక్కువగా మొగ్గు చూపాను. రెండింటిలోనూ నాకు నచ్చే మ్యాజిక్ రియలిజం ఎలానూ ఉంటుంది; అది ఇంకాస్త ఎక్కువ ఫిక్షనల్ గా ఉంటే, మరింత ఉత్సాహంగా చదవవచ్చన్నది నా ఆలోచన. కానీ ఈయన రచనల్లో అనేక తరహాలకు చెందిన సింబాలిక్ మీనింగ్స్ ఉంటాయని చదివే కొద్దీ అర్థమవుతోంది. 

గొప్ప రచయితల జీవితాలెందుకు వారి రచనల కంటే ఎక్కువ ఆసక్తికరంగా ఉంటాయో తెలీదు. అలా ఆసక్తి కలిగించే విషయాలు బోర్హెస్ జీవితంలో చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈయన రచనల్లో స్త్రీ పాత్రలు కనిపించవు. రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు గానీ అవి కేవలం కొన్ని (సాధారణం కాని) అవసరాలకు చెందిన ఒప్పందాలు మాత్రమే. మధ్య వయసులో అతను చూపును కోల్పోవడంతో, అప్పటివరకూ అతన్ని సంరక్షించి, లేదా కంట్రోల్ చేసిన అతని తల్లి, పెళ్లి ద్వారా బాధ్యతలను బదిలీ చేసే ప్రయత్నం చేసింది మొదటిసారి. ఆ బంధం ఎక్కువకాలం నిలవనే లేదు. రెండో సారి మాత్రం, కాన్సర్ బారిన పడి చనిపోయే కొంత కాలం ముందు, తన సెక్రెటరీని పెళ్లి చేసుకున్నాడు. ఇది కూడా ప్రేమకు చెందిన రూపాంతరం కాదని ఎవరూ చెప్పకపోయినా అర్థం చేసుకోవచ్చు, లేదా కనీసం భావించవచ్చు. అందుకు సాక్ష్యంగా, బోర్హెస్ విచిత్రమైన ఆలోచనల సమాహారమైన ఒక రచన 'The Sect of the Phoenix' ను, '(స్త్రీ పురుష) శారీరక సంబంధాన్ని నెరపే సమూహాన్ని' గురించి, ఆయన పరాయిలా నిలబడి చేసిన ఆశ్చర్య ప్రకటనగా విమర్శకులు విశ్లేషించారు. 

లాబిరింత్స్ కథలన్నీ, ఏ ఒక్కటీ మరొకదాన్ని మించినవే. ఇప్పటివరకూ చదివినవాటిలో నాకు నచ్చిన ఓ కథ, 'The God's Gift' లేదా 'The Writing of God' అనే పేరున్న కథ. ఇది చదువుతుంటే అనేక రకాల ఆలోచనలొచ్చాయి. లెక్కకు మించినన్ని భావాలు తల నిండా పొర్లిపోయాయి. చివరికి ఏ ఒక్క అర్థమూ పట్టుకు దొరకలేదు. అందునా, అన్ని రకాల మత గ్రంథాలనూ ఔపోసన పట్టి, ఆపై ప్రపంచంలోని ప్రతి జాతికీ చెందిన వివరాలన్నీ నంజుకు తినేసి, అన్ని వాదాలనూ, ఇజాలనూ కలగలిపి తాగేసి - ఆ వచ్చిన బలంతో మెటాఫర్లను వంచి వాక్యాలుగా చేసిన ఈ మహా విజ్ఞానవంతుడికి చెందిన రచనలను డిసైఫర్ చేద్దామని ప్రయత్నించడం, నాకున్న జ్ఞానానికి అజ్ఞానమవుతుంది. సరే పోనీ అనువాదమయినా చేద్దామనిపించింది. ఎప్పుడూ ఒక్క ఆంగ్ల కథనైనా అనువదించకుండానే, ఏకంగా బోర్హెస్ కథే! అయినా సరే, నాకర్థమైనంత వరకూ కొంత స్వేచ్ఛ తీసుకుని ప్రయత్నించాను. కేవలం  వాక్యాలను పదునుపెట్టుకునే ఉద్దేశ్యం మాత్రమే. 

దేవుడు రాసిన రహస్యం( The Writing of God)
అర్థగోళాకారంలో ఉన్న ఆ రాతి జైలు కట్టడం, చాలా లోతుగా ఉంటుంది. పూర్తిగా గుండ్రంగా లేని నేల మాత్రం, నొక్కి పెట్టబడినట్టనిపించే భావాన్నీ,  విశాలమైపోయిన అనుభూతినీ ఒకేసారి రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. దీన్ని రెండుగా విడగొడుతూ మధ్యలో ఒక రాతి గోడ కూడా ఉంది. గోడ చాలా ఎత్తే గానీ, పూర్తిగా పైవరకూ ఉండదు. అందులో ఒక వైపు నేనూ (ట్సినాకా), మరో వైపు ఒక చిరుతపులీ ఉంటాం. నేనో 'కాల్చి బుగ్గి చేయబడ్డ' పిరమిడ్ కు చెందిన మంత్రగాడినైతే. చిరుతపులి మాత్రం - అణువణువునా రహస్యాల్ని నింపుకుని, నిర్బంధపు స్థల కాలాలతో పోటీ పడుతున్నట్టుగా కూడా ఉంటుంది. మా మధ్యనున్న గోడకి, నేల మీద నించి చాలా ఎత్తువరకూ, ఒక పొడవైన ఇనుప ఊచల కిటికీ ఉంది. ప్రతిరోజూ, నీడల్లేని మిట్టమధ్యాహ్నం వేళ, కాలాన్ని మీద వేసుకుంటూ వస్తున్న ఆ జైలర్, జైలు పైకప్పుకున్న చిన్న తలుపు తీస్తాడు. కొన్ని మాంసం ముక్కల్నీ, జగ్గులతో నీళ్ళనీ, తాడుతో లోపలికి దింపుతాడు. అప్పుడే మా గుహలాంటి జైల్లోకి వెలుగు తన్నుకుంటూ వస్తుంది. ఆ వెలుగులోనే నాకు చిరుతపులి కనిపిస్తూ ఉంటుంది. 

ఇలా ఇక్కడ నేను ఎన్నేళ్లనించీ ఉన్నానో లెక్కే మరిచిపోయాను. వయసులో ఉన్నప్పుడు కాస్త అటూ ఇటూ తిరిగేవాడినే, ఇప్పుడు మాత్రం మరణపు ముద్ర వేసుకుని, దేవుళ్ళు నిర్ణయించిన ముగింపు కోసం ఎదురుచూడటం తప్ప మరేమీ చెయ్యలేను. మంత్రాల సాయం లేకుండా దుమ్ములోంచి పైకి కూడా లేవలేను. 

ఆ రోజు పిరమిడ్ ని బుగ్గిపాలు చేసినప్పుడు, గుర్రాల మీద వచ్చిన కొందరు వ్యక్తులు, గుప్తనిధి ఎక్కడ ఉందో చెప్పమని నన్ను చాలా హింసించారు. నా కళ్ళ ముందే దేవుడి విగ్రహాలను ధ్వంసం చేశారు కూడా. అయితేనేం, దేవుడు నన్ను ఒంటరిగా వొదిలేసి పోలేదు. నాకా చిత్రహింసలన్నీ మౌనంగా భరించే శక్తినిచ్చాడు. వాళ్ళు నన్ను చితక్కొట్టి, రూపురేఖలన్నీ మార్చేసి, ఈ జైల్లోకి తీసుకొచ్చి పడేసారు. 

కాలాన్ని ఏదో విధంగా వెళ్లబుచ్చమని విధి ముందరికి తోస్తుంటే, ఆ చీకట్లో కూర్చుని, అప్పటివరకూ నాకు తెలిసినదంతా గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేసాను. ఎన్నెన్ని నిద్రరాని రాత్రుళ్లో- సర్పాలు చెక్కిన రాళ్ళెన్ని ఉండేవో, లేదా వైద్యానికి పనికొచ్చే చెట్టెలా ఉండేదో  గుర్తు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నించే వాడిని. అలాగే ఏళ్ళకి ఏళ్ళు గడిపేస్తూ, మెల్లగా, ఎప్పటినించో నాదైన ఆస్తినొకదాన్ని చేజిక్కించుకున్నాను. సముద్రాన్ని చూడకముందే నావికుడికి రక్తప్రసారం ఎలా పెరిగిపోతుందో, నాక్కూడా అలానే, సన్నిహితమైనదేదో గుర్తుకు రాబోతోందని అర్థమయింది. కొన్ని గంటల తర్వాత ఆ విషయమేమిటో లీలామాత్రంగా తెలియసాగింది. అది దేవుడు పాటించే ఒక సంప్రదాయం. కాలం ముగిసే సమయానికి అంతటా విధ్వంసమూ, వినాశనమే మిగులుతుందని ముందుగానే గ్రహించి, ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన మొదటిరోజే ఈ చెడునంతా నాశనం చేయగల, ఒక మహిమాన్విత వాక్యాన్ని రాసాడు. ఎటువంటి మార్పు చేయడానికీ వీల్లేని విధంగా, ఎన్నో తరాలను చేరే విధంగా ఆయన ఆ వాక్యాన్ని రాసాడు. ఎక్కడ, ఎటువంటి గుర్తుల్లో దేవుడు దాన్ని రాశాడో ఎవ్వరికీ తెలీకపోయినా, ఆ వాక్యం మాత్రం రహస్యంగా ఎక్కడో రాయబడే ఉందని మాత్రం తెలుసు. అర్హుడైనవాడెవడికో ఏదో ఒక రోజు దాన్ని చదివే అవకాశం లభిస్తుంది. నాకేమనిపించిందంటే, 'ఎప్పటిలానే అంతం కాబోతున్న కాలం'లోని ఇప్పటివాడినైన, దేవుడి చిట్టచివరి పూజారినైన - నాకు, ఆ పవిత్రమైన వాక్యాన్ని కనిపెట్టి, అర్థం చేసుకోగలిగే అర్హత ఉండే ఉంటుంది కదా! ఈ జైలు నా ఆశను నాశనం చేయలేదు. నిజానికి దేవుడికి సంబంధించిన అసలు లిపిని నేను వేల సార్లు చూసి ఉంటాను. ఇప్పుడు చేయాల్సిందల్లా దాని నిజమైన లోతును తెలుసుకోవడమే. 

ఆ ఆలోచన నన్ను ఉత్సాహపరిచింది. భూమి పుట్టినప్పటినుండీ, దీని మీద, మలినం చేయలేని, నాశనం కాని ఎన్నో ప్రాచీన రూపాలున్నాయి. వాటిలో ఏదో ఒకటి నేను వెతుకుతున్న గుర్తై ఉండవచ్చు. దేవుడు చేసిన ఉపన్యాసం ఓ పర్వతంగా మారి ఉండవచ్చు. లేక ఒక నదో, ఒక సామ్రాజ్యమో, లేకపోతే ఒక నక్షత్ర సమూహమో అయి ఉండవచ్చు. కానీ శతాబ్దాలు గడిచే కొద్దీ కొండలు నేలమట్టమైపోతాయి కదా! నదులు దిశను మార్చుకోవచ్చు. సామ్రాజ్యాలు కూలిపోవచ్చు. నక్షత్ర సమూహాల రూపు రేఖలూ మారిపోవచ్చు. నేను వెతుకుతున్నది మరింత ఖచ్చితమైనదేదైనా అయి ఉండాలి. ఏమో, ఏ గింజల మీదో, గడ్డి పరక మీదో, పక్షుల మీదో, అంతెందుకు - అసలు నా ముఖం మీదే రాసి ఉందేమో ఆ రహస్యం! నా వెతుకులాటకు నేనే గమ్యాన్నైనా  అయి ఉండవచ్చు. ఈ ఆందోళన నన్ను తినేస్తున్నప్పుడు, 'చిరుత పులి కూడా దేవుడి సృష్టిలో భాగమే'నని గుర్తొచ్చింది. 

ఒక్కసారిగా నా మనసు విపరీతమైన జాలితో నిండిపోయింది. ఏ తెల్లవారుఝామునో, నా భగవంతుడు తన సందేశాన్ని ఈ చిరుతపులుల చర్మంపై లిఖించి ఉంటాడు, చిట్టచివరి మనిషి దాకా చేర్చడానికి! నా పక్క గదిలోనే ఓ చిరుత పులి ఉంది. సమీపంలోనే ఉన్న ఆ చిరుతపులి సహాయాన్ని నేను రహస్యంగానే అర్థించినట్టుగా భావించుకున్నాను. 

ఆ చిరుతపులి వంటి మీదున్న చుక్కల అమరికనూ, వరుస క్రమాన్నీ తెలుసుకోవడానికి అనేక సంవత్సరాలు వెచ్చించాను. ఒక్కో చీకటి సమయం ముగిసి, కాస్త వెలుగు ప్రకాశించగానే, ఆ పసుపు పచ్చని చర్మం మీదున్న నల్లని చుక్కల వరుసను నా మనసులో ముద్రించుకునేవాడిని. ఆ చుక్కల్లో కొన్ని బిందువులున్నాయి. కొన్ని, కాళ్ళ లోపలి అంచుల్లో గీతల్లా అమరి ఉన్నాయి. రింగు రింగులుగా చుట్టచుట్టుకుని మరి కొన్ని, మళ్ళీ మళ్ళీ చాలా చోట్ల కనిపించాయి. కానీ ఇవన్నీ కలిసి ఒకే ఒక్క పదం గానీ, శబ్దం కానీ అయి ఉండవచ్చు. చాలా చుక్కలకు ఎరుపు రంగు అంచులు కూడా ఉన్నాయి. 

ఇంత కష్టపడ్డానని చెప్పుకోకూడదు గానీ, 'ఈ రహస్యాన్ని ఛేదించడం నావల్ల కాదం'టూ రెండు మూడు సార్లైనా గట్టిగా కేకలేసి ఉంటాను. 'అంతటి పరిపూర్ణమైన హృదయమున్న దేవుడు, ఎటువంటి వాక్యాన్ని నిర్మించి ఉండవచ్చ'ని, నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు ఏ మానవ భాషలోనూ, మొత్తం విశ్వాన్ని ఉదహరించగలిగే ప్రతిపాదనలేవీ ఉండి ఉండవు. ఒక పులి మరో పులికి జన్మనిస్తుంది. జింకలో, తాబేళ్లో దానికి ఆహారంగా మారతాయి. జింక గడ్డిని ఆహారంగా స్వీకరిస్తుంది. ఆ గడ్డి నేల నుండి పుడుతుంది. ఆ నేలను స్వర్గం సృష్టిస్తుంది. భగవంతుడి భాషకు చెందిన ప్రతి పదమూ అనేక నిర్దుష్టమైన సత్యాల సమాహారాన్ని వివరించే విధంగా ఉంటుందని నాకనిపించింది. ఆయన రాసిన వాక్యం, సూచన ప్రాయంగా కాకుండా, స్పష్టంగా ఉంటుందనిపించింది. అయినా దేవుడు ఒక్క పదం పలికితే చాలు, అది పరిపూర్ణంగా ఉండదూ! ఆయన పలికిన ఏ ఒక్క పదమైనా, మొత్తం విశ్వం కంటే తక్కువధై ఉంటుందా! ఇంకా చెప్పాలంటే, కాలపు సమయం మొత్తాన్ని కూడినా కూడా, ఆ పదానికి తక్కువే అవుతుంది. ఆ ఒక్క పదానికి చెందిన నీడ కూడా ఒక భాషకు సరిపడేంత పెద్దదై ఉంటుంది. అయినా భాషదేముంది? అత్యాశతో కూడిన అల్పమైన పదాల అమరికే కదా. 

అది పగలో రాత్రో తెలీదు కానీ, నా జైలు గది నేల మీద ఒక ఇసుక రేణువు పడి ఉన్నట్టుగా కల వచ్చింది. నేనేం పట్టించుకోకుండా నిద్రపోతున్నాను. 'మెలకువ వచ్చి చూస్తే, ఆ ఇసుక రేణువు రెండు ఇసుక రేణువులుగా మారినట్టు'గా - మళ్ళీ కల వచ్చింది. మళ్ళీ నిద్రపోయాను. ఈ సారి అవి మూడయ్యాయి. చివరికి నేను ఆ అర్థగోళాకారంగా నిండిపోయిన ఇసుక రేణువుల క్రింద కూరుకుపోయి, చనిపోయే స్థితికి వచ్చేవరకూ - వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. నేనింకా కలలోనే ఉన్నానని నాకర్థమయింది. ఎంతో కష్టపడి, బలవంతంగా మెలకువ తెచ్చుకున్నాను. అయినా కూడా అనంతమైన ఆ ఇసుక రేణువుల సముదాయం నాకు ఊపిరాడకుండా చేస్తోంది. "నువ్వు మెలఁకువలోకి మేలుకోలేదు సుమా! అంతకు ముందరి కలలోకి మాత్రమే చేరావు." అని ఎవరో చెప్పారు. ఈ కల ఇంకో ముందరి కలలోకి మెలఁకువవతోంది. అలా ఎన్ని అనంతమైన కలల్ని దాటుకుని వచ్చానో అప్పటివరకూ! అక్కడున్న ఇసుక రేణువులన్ని కలలు! 'నువ్వు వెనక్కి తిరిగి వెళ్లాల్సిన దారి ఇక అంతమయ్యేది కాదు. నీకు నిజంగా మెలకువ వచ్చేలోపే నువ్వు చనిపోతావు' అని ఎవరో చెబుతున్నట్టుగా అనిపించింది. 

నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ ఇసుక నా నోటినిండా చేరి మంట పుట్టిస్తోంది. " కొన్నిఇసుక రేణువుల కలలు గానీ, కలల్లోపలి మరిన్ని కలలు గానీ నన్ను చంపలేవు." అంటూ గట్టిగా అరిచాను. అంతే! ఒక మెరుపులాంటి వెలుగు నన్ను నిద్రలేపింది. ఆ చీకటిలో, పైన ఒక వృత్తాకారపు కాంతి పుంజం కనిపించింది. ఆ వెలుగులో జైలరూ, తాడూ, మాంసం, నీళ్ల జగ్గులూ కనిపించాయి. 

పరిస్థితుల ప్రభావం వలన, మనిషి ఒక్కోసారి తన గమ్యం విషయంలో పొరపాటు పడతాడు. నేను దేవుడి పూజారిని మాత్రమే కాదు, అంతకుమించి ఒక ఖైదీని కూడా. అనంతమైన ఆ చిక్కుల కలల దారుల్లోంచి బయటపడి, ఒక్కసారిగా నేను నా ఇంటికి - అదే, ఈ జైల్లోకి మళ్ళీ చేరుకున్నాను. ఈ చీకటీ, ఆ పులీ, నా ఈ ముసలి శరీరమూ అన్నీ నాకిప్పుడు చాలా గొప్పగా అనిపిస్తున్నాయి. 

ఆ క్షణంలోనే హఠాత్తుగా, మాటల్తో చెప్పలేని, మరిచిపోలేని ఒక గొప్ప అనుభవం ఎదురైంది. దాన్ని వివరించేందుకు ఈ మాటలైనా సరైనవో కాదో తెలీదు గానీ, దైవత్వంలో, మొత్తం విశ్వంలో లీనమయ్యే అవకాశం లభించింది. ఆ తన్మయత్వం ఎటువంటి గుర్తులతోనూ చూపగలిగేది కాదు. ఓ కాంతి పుంజంలానో, ఒక పదునైన ఖడ్గంలానో, లేక పువ్వుల మాలగానో దేవుడు దర్శనమిచ్చాడు. నా కళ్ల ముందు గానీ, వెనుక గానీ, చుట్టుపక్కల గానీ ఎక్కడా లేని, అన్ని చోట్లా ఉన్న - అతి పెద్ద చక్రం కనిపించింది. ఆ చక్రం నీటితో తయారైంది. అలాగే నిప్పుతో కూడా. అంచులు కనిపిస్తున్నాయి గానీ అది అనంతంగా విస్తరించి ఉంది. విశ్వంలోని అన్ని వస్తువుల కలయికతో ఆ చక్రం ఏర్పడి ఉంటుంది. ఆ చట్రంలో నేనూ, నన్ను కొట్టి హింసించిన వ్యక్తీ కూడా చిన్ని చిన్ని భాగాలమే. ఆ అమరిక నాకు - కారణాలనూ, వాటి ఫలితాలనూ చూపించి, ఆ చక్ర స్వరూపాన్ని మొత్తంగా అర్థం చేసుకునే అవకాశాన్ని కలిగించింది. అర్థం చేసుకోగలగడం, ఊహించగలగడం కంటే కూడా గొప్ప అదృష్టం. అప్పుడే నేను విశ్వాన్నీ, దాని సన్నిహితమైన అమరికనూ చూసాను. విశ్వం పుట్టుకనూ, జీవ చక్రాన్నీ దర్శించాను. మొత్తంగా మారిన ఈ అనంతమైన ప్రక్రియను చూడటం వలన, నాకు పులి ఒంటిమీదున్న చుక్కలను చదవగలిగే యోగ్యత కలిగింది. 

ఆ వాక్యం, పద్నాలుగు విడి విడి పదాల కలయిక.  నేను గనక గట్టిగా ఆ వాక్యాన్ని ఉచ్చరిస్తే చాలు, చాలా గొప్ప శక్తివంతుడినవుతాను. ఒక్క సారి ఆ వాక్యాన్ని గనక ఉచ్చరిస్తే చాలు, నా చుట్టూ ఉన్న ఈ జైలు గోడలు మాయమైపోతాయి; నా చీకటిలో వెలుగు నిండుతుంది; నన్ను మళ్ళీ యవ్వనం వరిస్తుంది; మరణం నా దరిదాపులకు కూడా రాదు;  నన్ను హింసించినవాడి పైకి, ఆ పులినైనా ఉసిగొలపగలను; కూలిపోయిన పిరమిడ్లను మళ్ళీ నిర్మించగలను; మిరమిడ్లేమిటి! మళ్ళీ మొత్తం సామ్రాజ్యాన్నే నిర్మించగలను. నలభై అక్షరాలూ, పద్నాలుగు పదాలూ... అంతే, నేను ఇక ఈ సామ్రాజ్యానికి మహారాజునవుతాను. కానీ నేను ఈ వాక్యాన్ని ఉచ్ఛరించకూడదని నాకు తెలుసు. ఎందుకంటే, అప్పుడు నన్నే నేను మరిచిపోతాను. 

ఆ పులి వొంటిమీదున్న రహస్య సందేశాన్ని నాతోనే మరణించనీ. విశ్వాన్నీ, దాని గొప్ప అమరికనూ చూసిన వాడెవడైనా 'ఒక్కడి'లా ఆలోచించకూడదు. తన కష్టనష్టాల గురించి మల్లగుల్లాలు పడకూడదు. ఆ మనిషి అతనే కానీ, తను ఆ మనిషినేనన్న విషయం అతనికిప్పుడు ముఖ్యం కాదు. అతనిప్పుడు ఎవరూ కానప్పుడు, తన జీవితం ఏమైతే మాత్రం, తన జాతి ఏదైతే మాత్రం, అతనికెందుకు! కాలం నన్ను పూర్తిగా నాశనం చేసేవరకూ ఇలానే ఈ చీకట్లోనే పడుకుని ఉంటాను తప్ప, ఆ వాక్యాన్ని మాత్రం ఉచ్ఛరించను. 

Comments

Post a Comment

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//