//అనుకోకుండానే...//

//అనుకోకుండానే...//
*ఎక్కడికి పోయారు పిల్లకాయలంతా?
**అయిందా స్నానం? టెర్రస్ మీదకెళ్లారు... ఆడుకోవడానికి.
*వర్షం పూర్తిగా తగ్గిందో లేదో...
**తగ్గిందిలే. మా వాళ్లు కొత్తగా స్కేటింగ్ నేర్చుకుంటున్నారుగా. నీ పుత్ర రత్నాలకి చూపిస్తామని ఒకటే గోల!
*ఏంటి! వర్షిణికి కూడా నేర్పిస్తున్నారా!...
**అవును. నాకిద్దరూ ఒక్కటే.
*చూడ్డానికి అలా ఉంటుంది గానీ, పిల్ల బుద్ధిమంతురాలే లే.
**నవ్వినప్పుడు ఎంత కళగా ఉంటుందో! నువ్వు సరిగా చూసినట్టు లేదు.
*అవున్లే... ఇంతకీ ఆ అనాథాశ్రమం ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయా?
**తీసుకొచ్చి ఆర్నెల్లవుతోంది కదా. ఇంకేముంటాయి!
*ఎందుకంత సడెన్గా అటువంటి నిర్ణయం తీసుకున్నారక్కా! పోనీ అబ్బాయినైనా తెచ్చుకోవాల్సింది.
**చూడగానే వర్షిణి నాకోసమే అక్కడున్నట్టినిపించింది.
*ఐడియా నీదే అనుకుంటాగా...
**అవును. నాకు పెళ్ళికి ముందరి నుండీ కోరిక, అలా ఎవరికైనా కొత్త జీవితాన్నివ్వాలని. మీ బావగారు ఓ పట్టాన ఒప్పుకుంటేగా. అందుకే ఇంత లేటయింది.
*చిన్న పాపైనా బావుండేది. మరీ పదేళ్లంటే...అన్నీ తెలిసిపోయే ఏజ్ కదా?
**ఇద్దరూ ఒక వయసు వాళ్ళైతే బావుంటుందని.
*అయినా నువ్వు గ్రేటక్కా! అలా చూసుకోవడం అంత ఈజీ కాదు.
**దేవుడి సాక్షిగా చెబుతున్నాను. ఇద్దర్నీ వేరుగా చూడాలన్న ఆలోచన నాకు ఒక్కసారి కూడా రాలేదు.
*సరే గానీ, ఇంతకీ ఆవడలు వేస్తున్నామా? లేదా? బావగారికి ఇష్టం కదా :)
**మా మరిదికి ఇష్టమని బొబ్బట్లు కూడా చేస్తున్నాం.
*ప్రతీ పండక్కీ ఇలా కలిసామంటే ఈ అన్నదమ్ముల బొజ్జలు చూడలేక చావాలి :) అయినా పొద్దున్నే ఎక్కడికెళ్లారు షికారుకి!
**పిల్లలేమో కాలింగ్ బెల్... తలుపు తీసే ఉందిగా. మళ్ళీ కొడతారెందుకు!
*నువ్వుండక్కా. నే చూస్తాను.
...
*ఎవరో పాప కింద పడిపోయిందంటున్నారక్కా... స్కేటింగ్ చేస్తుంటే...టెర్రస్ అద్దం పగిలిందని...
**లాస్యా.......
*అక్కా! కొంచెం మెల్లగా. పడిపోతావ్! లిఫ్ట్ రానీ...
...
...
**కాదు కాదు... నా లాస్య కాదు... దేవుడా... ఓ... కాదు... కాదు!
*అక్కా... వర్షిణి!
**అయ్యో! నాకిద్దరూ ఒకటే... నాకిద్దరూ ఒకటే... వర్షూ .................
*********  

Comments

  1. :( టైటిల్ తో సగం కథ చెప్పారనమాట!

    ReplyDelete
    Replies
    1. అవునండీ, అసలు ఆ తల్లి మరిచేపోతుంది వర్షిణి విషయం. 

      Delete

Post a Comment

Popular posts from this blog

మో

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం