Posts

Showing posts with the label కవిత్వం

జన్మ

అది విశ్వం చూపునావరించేది సూర్యుడూ, చంద్రుడే మళ్ళీ అందులో మరిన్ని విశ్వాలు అందందులో మరెందరో సూర్యచంద్రులూ సన్నని దారాలేవీ కనిపించవు ఒకదాన్నొకటి వదిలీపెట్టవు చీకటి పరుపుల సంద్రాలలోన నిండు చీకట్ల శూన్యాలపైన తిరుగుతూ తిరుగుతూ వేగంగా కదులుతూ అంతలోనే నిదురిస్తూ అంబిలికల్ కార్డుకు చుట్టుకుని, వస్తాడు శిశువు ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి తల్లి కడుపులోంచి ఇలా అనంతానంత విశ్వంలోకి (Congratulations Satti Babu and Divya)

మో

Image
ఏ రోడ్ల మీద తిరిగాడో ఏ అరుగుల మీద కూర్చున్నాడో ఏ పరాయి పుర వీధుల్లో పచార్లు చేసాడో ఏ రైలు కిటికీలోకి నదిలా దూకి ప్రవహించాడో ఏ థియేటర్ సీటుకి వెన్నునొక్కిపెట్టి, తలల మీది పళ్లన్నీ చూపుల్తో గురిపెట్టి కొట్టాడో ఎన్నెన్ని నిగ్రహాల విగ్రహాల్ని ఏ లైబ్రరీ మూలల్లో ప్రతిష్ఠించి పూజించాడో ఏ బార్లో బాటిల్నో సాంబార్లో ఇడ్లీనో కుమ్మి కుమ్మి కవితలు చేసాడో ఎందరందగత్తెల వన్నెచిన్నెల్నో - వింజామరల్నో విశ్వమంతా విసిరి - విసిరి సేద తీరాడో ఎందరెందరు కవుల సమాధుల్ని తవ్వి తీసి ఎన్నెన్ని గుండెల వేళ్ళలోకి గుచ్చి గుచ్చి బ్రతికించాడో ఏ అక్షరాల తొక్కుడు బిళ్లల్ని విసిరి ఎన్ని దుమ్ము పొరల మెదళ్ళు దులిపి రేగ్గొట్టాడో ఎన్నిసార్లు సూరుడ్ని పొడిపొడిలా చితక్కొట్టి, ఏ మధ్యాహ్నం పూట - టీ పెట్టుకు తాగాడో ఎన్ని పొద్దున్నలు - చందమామను తరిమి తెచ్చి, ఏ కాఫీ కప్పుపైన వెన్నెల స్మైలీలు నొక్కి పిండాడో... ఏ వీధినీ ఉదయాన్నీ చూసినా ఏ కలనీ కన్నీటినీ మోసినా ఎక్కడో ఏ'మో'నని వెతుకులాటగానే ఉంది .

ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 2

సెల్సియస్ లలోని నీ సహనం, మరొకరి స్కేల్ మీద ఫారెన్ హీటు. కో'యెఫిషియంట్ల' కొలతల్లో కాస్త ముందుకో వెనక్కో, అంకెల సూత్రాలను చంకనేసుకుని మాత్రం, చుట్టూ సమాజం లోచన లోతూ, యోచన వైశాల్యమూ ఎవరిదెవరికి! రెండు రెట్ల బీటాగా, మూడు రెట్ల గామాగా - ఒక్కటే ఆల్ఫా మరిగి చల్లబడటాలు మనిషి గుణాలూను; మనసు థెర్మామీటర్లో నువ్వు మంచినీటివైనా, పాదరసానివైనా!

ఫిజిక్సాలసఫీ పోయెమ్స్ - 1

ఏ యాంగిలైతే మునుగుతుందో కాపిలరీ ట్యూబ్! ఆత్మ - శూన్యంలోకి బుడుంగుమన్న చప్పుడు బయటకు లాగే బలమేదీ సరిపోదు, వ్యతిరేకంగా వొంటి భారమే దిగదీస్తుంటే. జీవపు సాంద్రత గల సరికొత్త ద్రవంలో, విస్కాసిటీ చురకత్తుల - అంతులేని అంతర్యుద్ధం పోయిజెయీలూ, స్టోక్లూ ఎన్ని తత్వాలైనా పాడనీ; దేహపు పాత్ర పగిలిపోతేనే ఇక, ప్రాణానికి ముక్తీ , విముక్తీ!