'ఎలీ' ఏమైంది? - Review of Iranian Movie 'About Elly'

Image result for about elly

చాలా మందికి చిన్న చిన్న విషయాలకి కూడా అబద్ధమాడే అలవాటుంటుంది. అలా చెయ్యడం వలన, వాళ్ళకి ప్రత్యేకంగా కలిగే గొప్ప లాభమంటూ ఏమీ ఉండదు. కానీ ఏ చిన్నపాటి ఘర్షణ నుండో తప్పించుకోవడానికో, లేదా తామనుకున్న పని జరిపించుకోవడానికో అలా అబద్ధాలు చెప్పేస్తుంటారు. ఒక్కోసారి సరదాకి కూడా కొందరు అబద్ధాలాడుతుంటారు. ఆ అలవాటు ఎంతటి ప్రమాదకరమైనదో చూపిస్తుందీ సినిమా. ఇంకా, ఈనాటి ఇరానియన్ పౌరుల జీవన శైలీ, అక్కడి పరిస్థితుల్లో కలుగుతున్న మార్పులూ, వారి మహిళల్లో కలుగుతున్న చైతన్యం, ఇప్పటికీ రాజ్యమేలుతున్న పురుషాధిక్యతా లాంటి ఎన్నో విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ, పొరలు పొరలుగా విచ్చుకుంటూ, ఈ సినిమా కథ పరిచే సస్పెన్సయితే అంతా ఇంతా కాదు. ఇది 2009లో, పర్షియన్ భాషలో విడుదలైన ఇరానియన్ సినిమా 'ఎబౌట్ ఎలీ'.  

ఈ సినిమా కథంతా ఎలీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే సినిమా పేరు ఎబౌట్ ఎలీ. కొన్ని స్నేహితుల కుటుంబాలు (మూడు జంటలూ, వారి పిల్లలూ, ఇంకా అహ్మద్ అనే మరో స్నేహితుడూ) కలిసి చేస్తున్న మూడు రోజుల సరదా విహార యాత్రగా సినిమా మొదలవుతుంది. వేరే లోకంలో ఉన్నట్టున్న ఆ కుటుంబాలతో కలిసి, వారి మాటలని కాస్త శ్రద్ధగా వింటే, ఎలీ అనే అమ్మాయి వారి స్నేహితురాలు కాదనీ, వాళ్లామెని సరదాగా ఆ ట్రిప్ కి తీసుకొచ్చారనీ అర్థమవుతుంది. వాళ్లలోని సెపిదే అనే ఆమె కూతురి స్కూల్ టీచర్ ఎలీ. జర్మనీ నించి వచ్చిన, వారి మరో స్నేహితుడు అహ్మద్ కి ఆమెని పరిచయం చేసి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే ఆలోచనతో, సెపిదే, ఎలీని తమ కూడా పిక్నిక్ కి రమ్మని ఆహ్వానిస్తుంది. వాళ్లంతా కలిసి సముద్ర తీర ప్రాంతానికి వెళతారు. కొత్తవాళ్ల మధ్యన కొంచెం మొహమాటంగా, బిడియంగా మసులుతుంటుంది ఎలీ. వాళ్ళ సరదా మాటలూ, నవ్వులూ, కావాలని కాకపోయినా కొంతవరకూ ఎలీనీ ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. 

ఇంతలో ఆ స్నేహితుల్లోని ఓ కుటుంబానికి చెందిన చిన్న బాబు సముద్రంలో మునిగిపోబోయి, తృటిలో ప్రాణాలతో బయటపడతాడు. పిల్లలతో పాటుగా అప్పటివరకూ అక్కడే ఉన్న ఎలీ మాత్రం కనిపించదు. ఆమె, బాబును రక్షించడానికి సముద్రంలోకి వెళ్లిందో, లేక అంతకుముందే అక్కడినించి వెళ్లిపోయిందో వారికి అర్థం కాదు. ఇక అక్కడినిండీ కథ విపరీతమైన సస్పెన్స్ తో నిండిపోతుంది. భీకరంగా ఘోషిస్తున్న సముద్రం, అందులో తడుస్తూ ఆదుర్ధాగా పరుగులు తీస్తున్న మనుషులూ, అర్థంకాని సంశయాలూ, తీవ్రమైన భయాలూ, పట్టి కుదిపేసే అపరాధ భావాలూ తెర నిండా పరుచుకుని, ఒక్క క్షణం కూడా మన ఆలోచనల్ని అటూ ఇటూ పోనివ్వవు. వారి వెనకా ముందూ కదులుతున్న కెమెరాని అంత సులువుగా పట్టుకోలేకపోతున్నా, ఆ హడావిడికి మనమూ దాని వెంట పరిగెడతాం. ఆ ప్రయత్నంలో రెప్ప వేయడం కూడా మరిచిపోతామంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఎలీ దొరుకుతుందా, లేదా అన్నది ఒక సస్పెన్స్ అయితే, ఆమెకి చెందిన ఇంకో నిజం బయటపడి వీరందరినీ మరో కొత్త సమస్యలోకి నెడుతుంది. సామాన్యంగా జరిగే సంఘటనలను కూడా, కేవలం స్క్రిప్ట్ రాసుకునే విధానం ద్వారా ఎంత ఉత్కంఠభరితంగా మార్చవచ్చో, ఈ సినిమా దర్శకుడైన అజ్ఘర్ ఫర్హాదీకి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదేమోననిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా సినిమాకు గొప్ప రిచ్ నెస్ ను తీసుకురావడంలో బాగా సహాయపడ్డాయి.  

ఎలీతో పరిచయమై కేవలం ఒక్క రోజు మాత్రమే అయినా, ఆమె నీటిలో మునిగి చనిపోయిందేమోనన్న సంశయం ఆ స్నేహితుల సమూహంలో  తీవ్రమైన కలవరపాటును కలుగజేస్తుంది. ముఖ్యంగా ఆమెని పిక్నిక్ కి తీసుకొచ్చిన సెపిదే బాధ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మనకేం సంబంధం లేకపోయినా, అవతలివారి బాధ్యత మన మీద ఉన్నప్పుడు, వారి ప్రాణానికి ప్రమాదం వాటిల్లినప్పుడు, ఆ స్థితిని తట్టుకోవడం చాలా కష్టం. తన ఫ్రెండ్స్ కీ, ఎలీ కీ కూడా చిన్న చిన్న అబద్ధాలు చెప్పి, ఆమెను ఆ ట్రిప్ కి తీసుకొస్తుంది సెపిదే. కానీ ఎలీ ఏమైందో తెలియకపోయేసరికి, ఆ చిన్న చిన్న అబద్ధాలే ఆమె జీవితాన్నీ, మనసునూ అతలాకుతలం చేస్తాయి. టెన్షన్, గిల్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనిషిలో కలిగే మానసిక సంఘర్షణను, తన హావభావాల ద్వారా అద్భుతంగా ప్రదర్శించింది, సెపిదే పాత్ర ధరించిన గోల్షిఫ్టీ ఫర్హానీ. ఆ సముద్రం, ఎగసి పడే అలలూ, ఇసుకలో పార్క్ చేసి ఉన్న కార్లు, బొమ్మల్లా నిలబడ్డ మనుషులు, అంతటి దుఃఖ పూరితమైన వాతావరణంలోంచి కూడా సౌందర్యాన్ని వెలికితీసి చూపుతాయి. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల ముఖ కవళికలూ, శరీర కదలికలూ, వారి సంభాషణలూ ఆయా సందర్భాలకూ, వారి వారి పాత్రల వ్యక్తిత్వాలకూ అద్దాల్లా నిలబడుంటాయి. 

ఎన్నెన్నో సందేహాలు వారికి! తామంతా ఏడిపించడం వలన, ఎలీ ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయి ఉండి ఉంటుందేమోనన్న ఆశ ఓ పక్కన; అంతలోనే అలా జరిగి ఉండదేమోనన్న భయం. ఆమె ముసలి తల్లికి ఫోన్ చేస్తే, అసలు ఎలీ ఎక్కడికీ వెళ్లలేదనీ, తన ఇంట్లోనే ఉందనీ అబద్ధం చెబుతుంది. ఆవిడ అలా ఎందుకు చెప్పిందో వీరికి అర్థం కాదు. ఇంతలో ఆమె సోదరుడినంటూ మరో వ్యక్తి అక్కడికి వస్తాడు. ఎలీకి తోడబుట్టిన వాళ్ళెవరూ లేరని సెపిదేకి తెలుసు. మరి అతనెవరు? ఎందుకలా చెప్పాడు? అనేవి మరికొన్ని సందేహాలు. పరమ కోపిష్టిలా ఉన్న ఆ వ్యక్తి నుండి తమను తాము కాపాడుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది వారికి. వీటన్నింటి మధ్యనా, ఎలీ చనిపోయి ఉంటే, ఆ బాధ్యత తమదే అవుతుందన్న నిజం వాళ్ళ మనసుల్ని ముల్లులా పొడుస్తూనే ఉంటుంది. ఎలీ గౌరవానికి భంగం కలుగుతుందనీ, ఆమె బ్రతికున్నా లేకపోయినా ఆమె ఆత్మాభిమానాన్నైనా బ్రతికించి ఉంచాలనీ మొదట్లో భావించిన సెపిదే, చివరికి ఆమె భర్తా, స్నేహితుల ఒత్తిడికి తలొగ్గి, ఇష్టం లేకుండానే మరో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనే, పైకి ఎంతో బలంగా ఉన్నట్టు కనిపించే బంధాలు కూడా బీటలు వారి, తమ బలహీనతలను ప్రదర్శిస్తూ ఉంటాయి. విభేదాలూ, కలిసి కట్టుతనమూ రెండూ తప్పనిసరై కలిసి పని చేస్తాయి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తూనే, అనేక మానవ సంబంధిత ఉద్వేగాలనూ, సామాజిక అంశాలనూ సున్నితంగా స్పృశించిన గొప్ప సినిమా ఎలీ. ఈ సినిమా దర్శకుడైన అజ్ఘర్ ఫర్హాదీ దర్శకత్వం వహించిన, 'ఎ సెపరేషన్', 'ది పాస్ట్' అనే సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు. తన సినిమాలలో అత్యంత సహజమైన వాతావరణాన్ని సృష్టించడం, షాట్ ను కట్ చేయకుండా చాలాసేపు నడిపిస్తూ, పాత్రల మీద ఫోకస్ ను మార్చుకుంటూ పోతూ, సన్నివేశం యొక్క ప్రాముఖ్యతను మన మైండ్ లో రికార్డ్ చేయడం, క్లోజ్ అప్ షాట్ల వంటి కన్వెన్షనల్ పద్ధతులను వాడకుండానే, నేపధ్య సంగీతంలాంటి అదనపు హంగుల సహాయం లేకుండానే, అవసరమైన భావోద్వేగాలను ప్రేక్షకుల వద్దకు ఖచ్చితంగా, మరింత సమర్ధవంతంగా చేరేలా చేయడం ఫర్హాదీ ప్రత్యేకతలు. 

ఈ సినిమా చూడాలనుకునేవారు చదవకూడని భాగం :- నిజానికి ఎలీకి అంతకుముందే అలీరెజా అనే వ్యక్తితో పెళ్లి కుదిరిపోతుంది. కానీ అతని దురుసుతనాన్ని తట్టుకోలేక, ఆమె అతనినుండి విడిపోయే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆ సమయంలోనే సెపిదే ఆమెని ఈ ప్రయాణానికి ఆహ్వానిస్తుంది. జర్మనీ నుండి వచ్చిన అహ్మద్ ని కలిసి, అతను నచ్చుతాడేమో చూడమంటుంది. తన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకునేవరకూ ఇటువంటి పనులేవీ చేయనని ఎలీ చెప్పినా, సెపిదే ఆమెని బలవంతంగా తీసుకొస్తుంది. చివరలో సోదరుడినని చెప్పి వచ్చిన వ్యక్తి ఆ అలీరెజానే! ఎలీ అక్కడికి ఎందుకు వచ్చిందో అర్ధమయ్యేసరికి, ఆమె తన ఇష్టం మీదే అక్కడికి వచ్చిందో లేదో చెప్పమని, అతను సెపిదేని అడుగుతాడు. నిజం అతనికి తెలిస్తే, అసలే దురుసు మనిషి కావడం వలన, అందరూ ఇబ్బందుల్లో పడే అవకాశముందని భావించిన స్నేహితులంతా, సెపిదేని నిజం చెప్పవద్దని ఒత్తిడి చేస్తారు. అలా చేస్తే ఎలీ గౌరవానికి భంగం వాటిల్లుతుందని సెపిదేకి చాలా కష్టంగా అనిపించినప్పటికీ, అందరి ఒత్తిడికీ తలొగ్గి, ఎలీ తన ఇష్టం మీదే వారితో పాటుగా ఆ ట్రిప్ కి వచ్చిందని అలీరెజాతో అబద్ధం చెబుతుంది. చివరికి ఎలీ మృతదేహం సముద్రంలో దొరకడంతో సినిమా ముగుస్తుంది. 
(మొదటి ప్రచురణ మార్చ్ 2019 చతురలో)

Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం