ఓ మంచి సినిమా... సోనార్ పహార్


సోనార్ పహార్... ఈ బెంగాలీ సినిమా చూస్తున్నంత సేపూ నా కళ్లు చెమరుస్తూనే ఉన్నాయి. చివర్లో అయితే గొంతు పట్టేసి, బాగా నొప్పొచ్చి మరీ ఏడుపొచ్చింది. ఆ ఏడుపులో ఏడుపు, 'తెలుగులో ఇలాంటి సినిమాలెందుకు రావా!' అని మరికాస్త ఏడుపొచ్చింది (Just Kidding :) ). భారతీయ సినిమాకు ఆయువుపట్టులాంటిది ఎమోషన్. సినిమా ఎంత చెత్తగా, లాజిక్ లెస్ గా ఉన్నా, అందులో రెండు మూడు బలమైన ఎమోషనల్ సీన్లున్నప్పుడు, మనం దాన్నంత తేలిగ్గా తీసి పడెయ్యలేం. చూడటం ద్వారా కలిగే ఇటువంటి ఎమోషన్, జాలి నుండి పుడుతుంది. ఎదుటివారి నిస్సహాయతనూ, దుఃఖాన్నీ చూసినప్పుడు, మనిషన్నవాడెవడికైనా జాలి కలుగుతుంది. అందుకే, పెళ్లిలోపెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్లేందుకు బాధపడుతుంటే, పరిచయం లేని వారే కాదు, చివరికి అత్తగార్లు కూడా ఏడుస్తుంటారు. మగవారైనా అంతే; ఎదుటివారు పొగిలి పొగిలి రోదిస్తుంటే, కటికరాళ్లలా పడుండేవాళ్ళు తక్కువమందే ఉంటారు. నిజానికి ఈ సినిమా కథాంశానికి చెందిన కథతో ఇంతకుముందు చాలా సినిమాలే వచ్చాయి. కానీ సినిమా అంటే కేవలం కథ చెప్పడం మాత్రమే కాదుగా. శిల్పం సౌందర్యభరితమయ్యేది చెక్కిన చేతుల వల్లనే కదా! (అఫ్కోర్స్ ! కథ చెప్పడానికి కూడా అటువంటి నైపుణ్యమే కావాలి.)

కొత్తగా వచ్చిన కోడలి వల్ల కొడుక్కి దూరమవుతుంది, పండుటాకులాంటి ఉపమా. అప్పుడే ఆమె జీవితంలోకి బిట్లూ అనే మరో అనాథ కుర్రాడు ప్రవేశిస్తాడు. ఎదిగిపోయిన కొడుకు పసితనాన్ని ఆ పిల్లాడిలో చూసుకుంటుందామె. మరో స్నేహితుడి ప్రోత్సాహంతో, ఆపేసిన తన రచనా వ్యాసంగాన్ని మళ్ళీ కొనసాగిస్తుంది. కొడుకు బాల్యాన్ని, అప్పట్లో మ్యాజికల్ కథలుగా మార్చి రాసిన ఉపమా, ఇప్పుడు బిట్లూని హీరోగా చేసి ఆ కథల్ని కొనసాగిస్తుంది. ఎవరికీ చెప్పకుండా, ఆ పిల్లవాడితో కలిసి బంగారు కొండను చూడటానికి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు కొడుకుతో కలిసి చూడాలనుకున్న కాంచెన్ జంగా పర్వతమది. అక్కడినించే కథ మలుపు తిరుగుతుంది. కథా గమనంలో ఆ మార్పు, చాలా జాగ్రత్తగా గమనిస్తే గానీ అర్థం కాదు. చార్లీ కాఫ్మన్, 'ఎడాప్టేషన్' సినిమాలాగా, ఇక్కడినించీ సినిమా డ్రమెటిక్ గా మారిపోయి, ఒక మ్యాజికల్ మలుపు తిరుగుతుంది. అంటే, మాయలూ, మంత్రాలూ పనిచేస్తాయని కాదు. కథను కావాలనే వాస్తవానికి దూరంగా జరపడమన్నమాట. సినిమాలో ఆమె రాసే జానపద కథల్లాగే, ఉపమా జీవితం కూడా ఒక కొత్త ఒరవడికి గురయినట్టుగా చూపడమే ఆ టెక్నిక్. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఎక్స్పెరిమెంట్. వాస్తవాల్ని, అలా అతిశయాలతో బ్లెండ్ చేయడం సరిగా కుదరకపోతే, కథ అభాసుపాలవుతుంది. 

ఈ మలుపులో, హఠాత్తుగా కోడలు తన పొరపాటును గమనించుకుని పశ్చాత్తాపపడుతుంది. కొడుకు కూడా తన తప్పు తెలుసుకుని తల్లిని వెతుక్కుంటూ వస్తాడు. ఇక్కడే దర్శకుడు పరంబ్రాతా ఛటర్జీ మరోసారి తన మ్యాజిక్ ను ప్రదర్శించాడు. ఒక తల్లికి తన బిడ్డ నుండి కావాల్సిందేమిటి? ఆమెకు మరీ మరీ గుర్తొచ్చేవి, తన బిడ్డ బాల్యం తాలూకూ జ్ఞాపకాలే అయి ఎందుకుంటాయి? ఎందుకంటే బాల్యంలోనే ఆమె బిడ్డ ఆమెకు అత్యంత సమీపంగా ఉంటాడు కనుక. తల్లి తన సంతానం నుండి ఎప్పటికీ కోరుకునేది ఆ దగ్గరతనమే. పైకి ఎన్ని రూపాలుగా కనబడినా, ఆమె మనసు మూలల్లో ఉండే బలమైన ఆశ మాత్రం అదే. అందుకే సినిమా చివర్లో ఉపమా కొడుకు తను చేసిన తప్పులకు ఆమెను క్షమాపణలడగడు; బ్రతిమాలడు. పైగా అలుగుతాడు. బిట్లూ మీద ఈర్ష్యను ప్రదర్శిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. ఆమెకేం కావాలో అదే ఇస్తాడు. పెద్దవాడై దూరమైపోయాడనుకున్న కొడుకు మళ్ళీ పసి పిల్లాడిలా ప్రవర్తిస్తుంటే, ఆమెకు అంతకుమించిన ఆనందమేముంటుంది!  ఆ సీన్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. 

మనం ఎంతగానో ఎదిగిపోయామనో, చాలా మారిపోయామనో అనుకుంటాం కానీ మన (అంటే మనిషి) సహజ గుణాలు మాత్రం ఎప్పటికీ స్వచ్ఛతా, అమాయకత్వాలే. నిజమైన మెచ్యూరిటీ అంటే, మన లోపలి ఆ పసితనాన్ని మళ్ళీ గుర్తుపట్టగలగడమే. మనిషికి అదిచ్చే ఆనందం ఇంకేదీ ఇవ్వదు... జాగ్రత్తగా గమనించగలిగితే అర్ధమయ్యే, అతి సూక్ష్మమైన అర్థాలతో కూడిన మానసిక విశ్లేషణాంశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా బిట్లూ పాత్రని మలిచిన తీరు చాలా బావుంది. అమాయకత్వం, అల్లరి, చిలిపితనం, భయం సమపాళ్లలో కలిపినట్టుంటాడా అబ్బాయి. వాడికి కన్నీళ్లు రాకుండా ఏడవడమెలాగో తెలుసు. ఈ సినిమాలోని ప్రతీ పాత్రా, సాహిత్యంపై మమకారాన్ని కలిగి ఉండటం మరో విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతైనా రాయొచ్చు. అందుకే ఇక ఇక్కడితో ఆపేస్తున్నాను. సినిమా ప్రేమికులు మాత్రం మిస్ కాకూడని సినిమా. Netflix లో ఉంది. 

Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం