"Halkaa" Hindi Movie Review

మనసును తేలిక చేసే 'హల్కా'

నగరాలు విస్తరించుకుంటూ పోవడం వలన, పల్లెటూళ్ల నుండి అక్కడికి వలస పోయి, పొట్ట పోసుకుంటున్నవారికి చెందిన తరవాతి రెండూ, మూడూ తరాల వాళ్ళనే మనమిప్పుడు చూస్తున్నాం. ఈ తరాల యువకులకూ, పిల్లలకూ పల్లెటూళ్లనేవి కేవలం కథల్లో, ఊహల్లో విషయాలే తప్ప నిజంగా కళ్లతో చూసినవి కాదు. వాళ్లు పుట్టేదీ, పెరిగేదీ మొత్తం నగరాల్లోనే. అలా నగరాల చివరి బస్తీల్లో, మురికి వాడల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న అభాగ్యుల మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ అటువంటి వాతావరణంలోంచి అందాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ అతి చక్కగా బయటకి తీసి చూపిన సినిమా మాత్రం ఈ 'హల్కా' నే. ఈ హిందీ సినిమా ఇటీవలే 2018 సెప్టెంబర్ లో విడుదలైంది. ఎంత సేపూ డబ్బులేని కష్టాలూ, ఇరుకిళ్ళలో పడే బాధలూ, తాగి చితక్కొట్టే తండ్రులూ, సంపాదనంతా లాక్కునే దళారులూ, తిండి లేక మాడే డొక్కలూ, రోగాల బారిన పడి అల్లాడిపోయే దేహాలూ... ఇవేనా? అక్కడా కొన్ని కొన్ని మంచి క్షణాలుంటాయి జీవించడానికి. అప్పుడప్పుడూ అవి స్వచ్ఛమైన పూవుల్లా విరబూసి నవ్వుతుంటాయి. అటువంటి కొన్ని క్షణాల్ని ఒడిసి పట్టగలిగితే, తీసుకొచ్చి ఇలా తెర మీద చూపగలిగితే హల్కా సినిమా అంత బావుంటాయి. అంటే అక్కడ కష్టాలు లేవని కాదు, చూసే కోణాన్ని బట్టీ, అర్థం చేసుకునే మనసును బట్టీ దృశ్యమెలా మారిపోతుందో ఈ సినిమా చెబుతుంది. దర్శకుడు నిలా మధబ్ పాండా, ఇలా అనేక రకాలైన సామాజిక సమస్యలను, తనదైన ఒక ప్రత్యేక దృష్టి కోణం నుండి చిత్రించి చూపడంలో సిద్ధహస్తుడు. ఇతను ఇంకా, 'అయామ్ కలాం, కడ్వీ హవా ' లాంటి అనేక మంచి సినిమాల్నీ, 'జలధార, క్లైమేట్స్ ఫస్ట్ ఆర్ఫన్స్' లాంటి డాక్యుమెంటరీలనీ నిర్మించాడు. చాలా అవార్డులు గెలుచుకున్నాడు. 

ఢిల్లీ నగర శివార్లలోని లోని ఒక మురికివాడలో అమ్మా నాన్నల్తో కలిసి నివసిస్తుంటాడు ఎనిమిదేళ్ల పిచ్కూ. అమ్మ అగరవత్తులు తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమలో పని చేస్తుంటుంది. నాన్న రిక్షా నడుపుతుంటాడు. పిచ్కూ మాత్రం పగలంతా, డంప్ యార్డ్ లోని చెత్తను వేరు చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ పిల్లాడికి ప్రత్యేకంగా కష్టాలంటూ ఏమీ ఉండవు. ఉన్నదల్లా ఒకటే సమస్య. వాడ వాడంతా వాడే రైలు పట్టాల్ని వాడుకుని, అందరి ఎదురుగా కాలకృత్యాలు తీర్చుకోవడం వాడికి చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఆ వాసనలకి డోకొస్తూ ఉంటుంది. హాయిగా తమ ఇంటి వెనకే ఒక టాయిలెట్ కట్టించుకోవాలని వాడి కోరిక. దానికోసమే ప్లాన్లు వేస్తుంటాడు. గోపీ అనే స్నేహితుడితో కలిసి అనేక అవరోధాల్ని దాటుకుంటూ, చివరికి తనంతట తానే ఒక టాయిలెట్ నిర్మించుకుంటాడు. బస్తీ మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలుస్తాడు. 

కావడానికి చాలా మామూలుగా అనిపించే కథే అయినా, ఇక్కడే దర్శకుడి దృష్టి కోణమూ, అతని దర్శకత్వ ప్రతిభా, సినిమాటోగ్రాఫర్ నైపుణ్యమూ బయటపడేది. ఎంతటి కష్టాన్నైనా, ఒక పాజిటివ్ కోణం నుండి చూస్తూ, తేలికైన మనసుతో స్వీకరించినప్పుడు, దాని ప్రభావం ఎలా తగ్గిపోతుందో హల్కా సినిమా మనకి  చూపిస్తుంది. మనిషి ఆశాజీవి. ఎప్పుడూ బ్రతికుండటం కోసమే అతని పోరాటం. నడి సముద్రంలో కూడా చిన్న గడ్డి పోచలాంటి ఆధారం కోసం వెతుకుతూనే ఉంటాడు. ఆశలేనిదే జీవితమే లేదు. అదే ఆశతో బ్రతకమంటుందీ సినిమా. అంతేకాక, ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, నిన్నే మొదటి అడుగు వెయ్యమంటుంది. అందుకే 'ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పువు ముందు నువ్వే కమ్మంటూ' మహాత్మాగాంధీ చెప్పిన సూక్తితో సినిమా మొదలవుతుంది. 'టాయిలెట్ కావాలనే పిచ్కూ కోరిక' అనే దారాన్ని పట్టుకుని, దాని గుండా  అనేక సున్నితమైన అంశాల్ని గుచ్చుకుంటూ, అద్భుతమైన మాల కట్టుకుంటూ పోయాడు దర్శకుడు. నగర శివార్లలో ఉండే మురికి వాడల్లోని వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. ఒకే ఒక చిన్న గదిలో కనిపించే టీవీలూ, కూలర్లూ, బయట పార్క్ చేసి ఉన్న మోటార్ బైక్ ల మీద ఆరేసిన బట్టలూ, కట్టలు కట్టి పడేసిన చెత్తతో నిండిన ప్లాస్టిక్ కవర్లూ, బస్తీ వెనుక గుండా మహానదిలా ప్రవహించే మురికి కాలవా, వీధుల్లో యథేచ్ఛగా తిరిగే పందులూ, ఉదయాన్నే ప్లాస్టిక్ బాటిళ్లతో నీళ్లు పట్టుకుని రైలు పట్టాల మీదకి పరిగెత్తే జనాలూ...ఇలా అన్నీ నిజాలే కనిపిస్తుంటాయి; కానీ నిస్తేజంగా కాదు, రంగురంగుల రూపాల్లో. ఎక్కడా కష్టాలూ, కన్నీళ్లూ, సమస్యలూ అనే మాటల్ని రానివ్వకుండానే, నగరీకరణ మూలంగా, ఆర్ధిక అసమానతల కారణంగా, వికృతంగా మారిపోతున్న సామాజిక పరిస్థితుల్నీ, అన్యాయంగా బలైపోతున్న మనుషుల జీవితాల్నీ మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించాడు దర్శకుడు మధబ్ పాండా. ఆ ఇరుకు వీధుల్లోంచి అద్భుతమైన అందాన్నీ, సహజత్వాన్నీ పిండి రాల్చాడు సినిమాటోగ్రాఫర్ ప్రతాప్ రౌత్. ఎప్పుడూ పెదవుల్లో చిరునవ్వుల్ని పూయించడమే తప్ప, కళ్లని కన్నీటితో నింపుకోవడం తెలీని నిర్మలమైన మనసున్న పిచ్కూగా నటించిన తథాస్తు అనే అబ్బాయి నటన, సినిమాకి మరింత వన్నె తీసుకొచ్చింది.  

సినిమాలోని కొన్ని ఆణిముత్యాల్లాంటి అంశాల్ని చూద్దాం. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన పిల్లలు, డంప్ యార్డ్ ల మీద వ్యాసాలు రాయడానికి రావడం, వీధుల్ని శుభ్రం చేయడం చూసి, మన పిచ్కూ, వాడి స్నేహితులూ నవ్వుకునే దృశ్యం ద్వారా, మన సమాజంలో వస్తున్న అసాధారణమైన మార్పుల్నీ, వింత పోకడలల్నీ చూసుకుని నవ్వుకోవాలో ఏడవాలో మనల్నే తేల్చుకోమంటుంది ఈ సినిమా. అదే పెద్ద స్కూల్ కి చెందిన ఒక పిల్లాడు, ఇలా చెత్త మధ్యన తిరుగుతున్న తన వయసు పిల్లల్ని చూసి, వాళ్ళ కోసమని తనకి తోచిన రీతిలో ఒక పరిష్కారాన్ని ఆలోచిస్తాడు. మాస్క్ ల్నీ, పెర్ఫ్యూమ్ బోటిల్నీ గిఫ్ట్ ప్యాక్ చేసి స్కూల్ బస్ లోంచి వీళ్ళ దగ్గరికి విసురుతాడు. పిల్లవాడు కనుక వాడికి సమస్య మూలానికి ఎలా వెళ్లాలో తెలీదు. వాడికి తోచింది చేసాడు. కానీ పెద్దవాళ్ళమైన మనం మాత్రం, ఆ మాత్రమైనా ఆలోచిస్తున్నామో లేదోనన్న విషయాన్ని మనమే ఆలోచించుకోవాలి. ఇలాంటి వాడల్లో టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం డబ్బులిస్తుంది. అందులో సగం అవినీతి పరులైన అధికారులు నొక్కేస్తుంటే, చేతిలో పడిన మిగిలిన మొత్తాన్ని ఈ వాడల్లోని జనం వేరే పనులకి వాడేసుకుంటున్నారు. పిచ్కూ తండ్రి కూడా అలా టాయిలెట్ నిర్మాణానికని విడుదలైన పన్నెడు వేలలో, అధికారులు తినెయ్యగా చేతిలో పడిన ఆరువేలనీ ఆటో కొనుక్కోవడానికి దాచుకుంటాడు. కానీ పిచ్కూ మాత్రం, అట్ట ముక్కలతో గోడలు నిలబెట్టుకుని, కష్టపడి సంపాదించిన డబ్బులతో టాయిలెట్ సీట్ కొనుక్కుని తన కల నెరవేర్చుకుంటాడు. సంకల్పమంటూ ఉంటే, చేయలేనిదేమీ లేదని నిరూపిస్తాడు. 

సినిమా అంతా ఒక అందమైన కలలా సాగిపోతుంది. రంగు కాగితంలాంటి పిచ్కూ పసితనపు అమాయకత్వం మధ్యన లోకపు కర్కశత్వాన్ని పొట్లం కట్టేసి, నర్మగర్భంగా ఎన్నో విషయాల్ని తెలియజేస్తుంది. పాటలు ఉత్సాహకరమైన సంగీతంతో పైకి హుషారును రేకెత్తిస్తూనే, పొరలు పొరలుగా సాహిత్యంలో అనేక అర్థాల్ని దాచుకుని ఉంటాయి. పిచ్కూతో పాటుగా, అడ్డబొట్టు పెట్టుకు తిరిగే తమిళ పిల్లలూ, వస్తే ఆగకా, ఆగిపోతే రాకా అవస్థలు పడుతూ, మాటి మాటికీ రైలు పట్టాల మీదికి పరిగెత్తే ఓ బస్తీ మనిషీ, బురఖాల్లో కనిపించే ముస్లిం మహిళలూ, ఇటుక గోడల మీద కనిపించే డిష్ టీవీ యాంటీనాలూ, పిల్లల్ని చేరదీసి రాత్రుళ్లు రైలు పట్టాల పక్కన పాఠాలు చెప్పే యువతీ... ఇలా అక్కడి వాతావరణంలోని వైవిధ్యాన్ని అతి సహజంగా ప్రతిబింబింపచేసే అనేక అంశాలు, ఈ సినిమా రెండో సారి చూసినప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. "ఇంత మంచి టాయిలెట్ మా ఇంట్లో కూడా లేదు." అంటాడు, పిచ్కూ కట్టిన టాయిలెట్ ను చూసి ఓ ఉన్నతాధికారి. పిచ్కూ లాంటి గొప్ప పట్టుదల కూడా మనలో ఇప్పుడు చాలా మందికి లేదు. ఎటువంటి తీర్పులూ ఇవ్వకుండానే, సమాజంలో చైతన్యాన్ని తీసుకు రావడానికి ప్రయత్నించిన 'హల్కా' సినిమా చూడటం, నిజంగా ఒక గొప్ప అనుభూతి. 
(మొదటి ప్రచురణ - ఫిబ్రవరి 2019 చతురలో)


Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం