అంతుపట్టని రచయిత - జూలియో కొర్తసార్

 జూలియో కొర్తసార్ కథల్లోని సందిగ్ధతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవివేకమే. అలాగని అవి అర్థం కాకుండా, అసంపూర్ణంగా కూడా ఉండవు. కథ పూర్తవుతుంది. అర్థమవుతుంది. ఒక మంచి కథను చదివిన అనుభూతినీ కలిగిస్తుంది. కానీ ఒక విచిత్రమైన చిక్కుముడిలాంటి సందిగ్ధత, ఆలోచనను అంత త్వరగా వదిలిపెట్టదు. ఆ ముడిని విప్పడం కుదరదని తెలిసినా, ప్రతీ విషయాన్నీ తరచి తరచి తర్కించడానికీ, ఒక క్రమ పద్ధతిలో ప్రవర్తించడానికీ అలవాటు పడిన మన మెదడు, ఆ కథ మీద చాలా సేపటివరకూ పని చేస్తూనే ఉంటుంది. అందులోని అసలు మర్మమేమిటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. చివరికి ఆ కథకు ఒక లాజిక్ ను ఆపాదించి గానీ స్థిమితపడదు. కొర్తసార్ కథలన్నీ ఇంచుమించు ఇలానే ఉంటాయి. ఒక విచిత్రమైన ఆంబిగ్యుయుటీతో నిండి ఉండి, పూర్తిగా చెప్పకుండానే అంతా చెప్పేసినట్టుంటాయి. ఎంత గింజుకున్నా సగటు మనిషి ఊహలు చేరలేని సర్రియలిస్టిక్ స్పేస్ లో, పారడాక్స్ ల పజిల్స్ గుండా ప్రయాణిస్తుంటాయి. 

ఉదాహరణకు 'Axolotl' అనే కథలో, కథకుడు ఒక అక్వేరియంకి వెళ్ళినప్పుడు, అక్కడ యాక్సొలోటొల్ అనే సముద్ర జీవులను చూసి, వాటి ఆకర్షణలో పడతాడు. అది మొదలు, రోజూ అక్కడికి వచ్చి, కదులూ మెదులూ లేని ఆ జీవుల్ని గంటల తరబడి చూడటమే పనిగా పెట్టుకుంటాడు. మెల్లగా అతడు యాక్సొలోటొల్ గా మారిపోతూ, బయట నుండి చూస్తున్న తననే అద్దాల్లోంచి చూసుకుంటాడు. లేదా చూసుకుంటుంది. అలా చూస్తూ చూస్తూ, కథకుడు పూర్తిగా యాక్సొలోటొల్ గా మారి అక్కడే ఉండిపోతుంది. ఆకర్షణ పూర్తిగా వదిలిపోయిన ఆ వ్యక్తి, చివరికి అక్కడికి రావడమే మానేస్తాడు. ఈ కథలో, కథకుడు ఒకే సారి ఒక మనిషీ, ఒక సముద్ర జీవీ మాత్రమే కాదు, ఆ మనిషికి ఆ జీవి మీద ఏర్పడిన అబ్సెషన్ అనే ఒక ప్రాణం లేని భావం కూడా. ఇదిగో! ఈ కథకు నేను కల్పించుకున్న లాజిక్ ఇది. నిజానికి ఈ కథ, చదివిన ప్రతి ఒక్కరికీ వేరు వేరుగానే అర్థమవుతుంది. ఒక్కరికే పది సార్లు చదివితే పది రకాలుగా అర్థమవుతుంది. 

'House taken over' అనే కథలో, అన్నాచెల్లెళ్ళిద్దరు ఒక పెద్ద ఇంట్లో నివసిస్తుంటారు. ఆ ఇల్లు, వెనక వైపునుండి మెల్లగా ఆక్రమణకు గురవుతూ ఉంటుంది. ఆ ఆక్రమించుకుంటున్న వాళ్లంటే వీరికి చాలా భయం. ఆభాగంలోకి పొరపాటున కూడా వెళ్ళరు. చివరికి ఆ ఇల్లు పూర్తిగా ఆక్రమింపబడుతుంది. ఆ ఎవరో ఆక్రమించుకుంటున్న తమ స్వంత ఇంట్లోంచి బయటపడిన ఆ అన్నాచెల్లెళ్ళ వెనక, ప్రశ్నలేమీ అడక్కుండానే, వెనక్కి తిరిగి చూడకుండానే మనం కూడా రోడ్డు మీదికి నడిచొస్తాం. ప్రమాదమేమిటన్న ఆలోచననైనా పాఠకుడికి రానివ్వకుండా, అందులోంచి బయటపడాలన్న కోరికను మాత్రం కలిగించే కథ ఇది. 

'The Gates of Heaven' అనే కథలో, భార్య మరణం తాలూకూ బాధలో ఉన్న 'మారో' అనే వ్యక్తి, ఆమె మరణించిన రోజే, ఆమె మృతదేహం ఇంకా ఇంట్లో ఉండగానే, ఆ బాధ నుండి బయటపడటానికని, తన స్నేహితుడితో కలిసి బార్ కి వెళ్తాడు. తాగిన నిషాలో, విషాదాన్ని తాత్కాలికంగా మరిచిపోయిన ఆనందంలో అతను మునిగితేలుతుండగానే, అనుకోకుండా అతని భార్య సెలీనా లాంటి ఒక స్త్రీ అక్కడ కనిపిస్తుంది. ఆమె, అతని భార్య పోలికలున్న మరో అమ్మాయా, లేక అతని భార్య ఆత్మనా అన్న విషయాన్ని మాత్రం మనమే తేల్చుకోవాలి. ఇక్కడ కథ చెప్పేది భర్త కాదు, అతని స్నేహితుడు. ఆ స్నేహితుడి కళ్ల గుండా కూడా మనకి సెలీనాని చూపించడమే, రచయిత తాలూకూ సర్రియలిస్టిక్ మార్క్.  

మరో కథ 'Letter to a young lady in Paris' లో కథకుడు, ఆండ్రియా అనే స్నేహితురాలికి ఉత్తరం రాస్తుంటాడు. ఆమె పారిస్ వెళ్లడంతో, ఆమె వచ్చేవరకూ ఆమె అపార్ట్మెంట్ లో ఉండటానికి వస్తాడతడు ఆ ఇంటిలోపలి వస్తువుల కుదురుతనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అతడామెకు ఉత్తరం రాయడానికి ఒక విచిత్రమైన కారణముంది. అతడు నెలకోసారి ఉండుండీ ఓ కుందేలును కక్కుకుంటూ ఉంటాడు. అందుకు ప్రత్యేకమైన కారణమేమీ ఉండదు. కానీ ఆ అపార్ట్మెంట్ కు వచ్చాకా, అతడి కుందేళ్లు కక్కే సమస్య ఎక్కువైపోతుంది. అవన్నీ కలిపి పది కుందేళ్ళయిపోవడంతో, వాటిని పగలంతా అలమారాలో దాచిపెట్టడం, రాత్రుళ్ళు బయటకు వదిలి ఏమీ పాడు చేయకుండా కాపలా కాయడం, అతనికి వ్యసనంగా మారిన పెద్ద బాధ్యతైపోతుంది. ఆండ్రియా ఇంట్లోని వస్తువులు పాడటానికి తాను మాత్రమే కారణం కాదని చెప్పడానికే ఆ ఉత్తరం రాస్తున్నానంటాడు. పది కుందేళ్ళూ పదకొండైతే, ఇక పన్నెండు కూడా అయినట్టేనంటూనే, తెల్లవారేసరికి, చచ్చిపడి ఉన్న ఆ పది కుందేళ్ళనూ ఎవరూ పట్టించుకోరనీ, పిల్లలు స్కూళ్లకెళ్లే టైమవకుండానే అక్కడున్న మరో పెద్ద దేహాన్ని తరలించే పనిలో అంతా ఉంటారనీ ముగిస్తాడు. అంటే ఆ ఉత్తరం ఒక కన్ఫెషన్ తో పాటుగా, సూసైడ్ నోట్ కూడానన్నమాట. ఈ కథలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలన్న ఆలోచన చేయడం కూడా అనవసరమే. 

'Continuity of Parks' అనే కథ మాత్రం థర్డ్ పర్సన్ నేరేషన్ లో సాగుతుంది. ఒక వ్యక్తి తన గార్డెన్ లో కూర్చుని నవల చదువుతూ ఉంటాడు. పుస్తకంలో, అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్న ఇద్దరు ప్రేమికులు రహస్యంగా కలుసుకునే సందర్భమొకటి అత్యంత మనోహరంగా వర్ణింపబడుతూ ఉంటుంది. తన భర్తను చంపేయమని, ఆ ప్రేమికురాలు, తన  ప్రేమికుడిని కోరుతుంది. తన భర్త ఎక్కడుంటాడో, అక్కడికి ఎలా వెళ్లాలో చెబుతూ ఆమె చేసిన సూచనలు, సరిగ్గా నవల చదువుతున్న ఆ వ్యక్తి దగ్గరకు మనల్ని తీసుకెళతాయి. ఇది 'మ్యాజికల్ రిలిజమా, చిక్కుముడి విప్పాల్సిన సస్పెన్సా, లేక ఒక రచన పాఠకులను ఎంతగా తనలో మమేకం చేసుకోగలదో చెప్పే కథ నా' అన్నది తేల్చుకోవడం, ఇక మన ఊహలకి దొరికే స్వేచ్ఛ. 

ఒక క్రమం లేకుండా ఒక కథనో విషయాన్నో మనమెలా చెప్పలేమో, అలానే క్రమంలో ఇమడటమెలాగో తెలియక విరిగి పడుతున్నట్టుండే వింత వాక్యాల విచిత్రమైన కథ 'బ్లో అప్'. ఒక కొసను పట్టుకుంటుంటే రెండో వైపునుండి జారిపోతూ, రూపంలేని రూపానికి రూపంలా చెరిగిపోతుంటుందీ కథ. (ఆయన కథలు చదివాకా ఇటువంటి వాక్యాలు అనుకోకుండా వచ్చేస్తే, అది రాసినవాళ్ల తప్పు కాదు :) ). కుతూహలంగా పుడుతూ పుడుతూనే, తీరా తీరందాకా రాకుండానే చెదిరి వెనక్కెళ్లిపోయే చిన్న చిన్న అలల్లాంటి వాక్యాలీయన కథల్లోవి. ఒక ప్రత్యేకమైన నిర్మాణంలో నిర్బంధింపబడకపోయినా, తీరాల మధ్యలోనే ఒంపులు తిరిగే సహజమైన నదీ జలాల్లా ప్రవహిస్తుంటాయివన్నీ. నూవో రోమా తరహాలో రాయబడ్డ ఈ కథలన్నీ, ఒక మగత నిద్రలాంటి స్థితిలో, సబ్ కాన్షస్ మైండ్ లోంచి జారిపడినట్టుగా ఉండి, రచయితను పాఠకుడికి ఆవహింపజేస్తాయి. మొత్తంగా చూస్తే కొర్తసార్ ని, ఒక 'కథల ప్రయోగశాల' అంటే సరిపోతుంది. ఇక ఈయన మరింత ఎక్స్పెరిమెంటల్ గా రాసిన 'Hopscotch' నవల చదవాలి. 

Comments

Popular posts from this blog

మో

//అనుకోకుండానే...//

లాబిరింత్స్ (labyrinths) - బోర్హెస్ వేసిన చక్రవ్యూహం