'ఎలీ' ఏమైంది? - Review of Iranian Movie 'About Elly'
చాలా మందికి చిన్న చిన్న విషయాలకి కూడా అబద్ధమాడే అలవాటుంటుంది. అలా చెయ్యడం వలన, వాళ్ళకి ప్రత్యేకంగా కలిగే గొప్ప లాభమంటూ ఏమీ ఉండదు. కానీ ఏ చిన్నపాటి ఘర్షణ నుండో తప్పించుకోవడానికో, లేదా తామనుకున్న పని జరిపించుకోవడానికో అలా అబద్ధాలు చెప్పేస్తుంటారు. ఒక్కోసారి సరదాకి కూడా కొందరు అబద్ధాలాడుతుంటారు. ఆ అలవాటు ఎంతటి ప్రమాదకరమైనదో చూపిస్తుందీ సినిమా. ఇంకా, ఈనాటి ఇరానియన్ పౌరుల జీవన శైలీ, అక్కడి పరిస్థితుల్లో కలుగుతున్న మార్పులూ, వారి మహిళల్లో కలుగుతున్న చైతన్యం, ఇప్పటికీ రాజ్యమేలుతున్న పురుషాధిక్యతా లాంటి ఎన్నో విషయాలను అంతర్లీనంగా చర్చిస్తూ, పొరలు పొరలుగా విచ్చుకుంటూ, ఈ సినిమా కథ పరిచే సస్పెన్సయితే అంతా ఇంతా కాదు. ఇది 2009లో, పర్షియన్ భాషలో విడుదలైన ఇరానియన్ సినిమా 'ఎబౌట్ ఎలీ'. ఈ సినిమా కథంతా ఎలీ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే సినిమా పేరు ఎబౌట్ ఎలీ. కొన్ని స్నేహితుల కుటుంబాలు (మూడు జంటలూ, వారి పిల్లలూ, ఇంకా అహ్మద్ అనే మరో స్నేహితుడూ) కలిసి చేస్తున్న మూడు రోజుల సరదా విహార యాత్రగా సినిమా మొదలవుతు...