"Halkaa" Hindi Movie Review

మనసును తేలిక చేసే 'హల్కా' నగరాలు విస్తరించుకుంటూ పోవడం వలన, పల్లెటూళ్ల నుండి అక్కడికి వలస పోయి, పొట్ట పోసుకుంటున్నవారికి చెందిన తరవాతి రెండూ, మూడూ తరాల వాళ్ళనే మనమిప్పుడు చూస్తున్నాం. ఈ తరాల యువకులకూ, పిల్లలకూ పల్లెటూళ్లనేవి కేవలం కథల్లో, ఊహల్లో విషయాలే తప్ప నిజంగా కళ్లతో చూసినవి కాదు. వాళ్లు పుట్టేదీ, పెరిగేదీ మొత్తం నగరాల్లోనే. అలా నగరాల చివరి బస్తీల్లో, మురికి వాడల్లో, దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న అభాగ్యుల మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ అటువంటి వాతావరణంలోంచి అందాన్నీ, ఆశావహ దృక్పథాన్నీ అతి చక్కగా బయటకి తీసి చూపిన సినిమా మాత్రం ఈ 'హల్కా' నే. ఈ హిందీ సినిమా ఇటీవలే 2018 సెప్టెంబర్ లో విడుదలైంది. ఎంత సేపూ డబ్బులేని కష్టాలూ, ఇరుకిళ్ళలో పడే బాధలూ, తాగి చితక్కొట్టే తండ్రులూ, సంపాదనంతా లాక్కునే దళారులూ, తిండి లేక మాడే డొక్కలూ, రోగాల బారిన పడి అల్లాడిపోయే దేహాలూ... ఇవేనా? అక్కడా కొన్ని కొన్ని మంచి క్షణాలుంటాయి జీవించడానికి. అప్పుడప్పుడూ అవి స్వచ్ఛమైన పూవుల్లా విరబూసి నవ్వుతుంటాయి. అటువంటి కొన్ని క్షణాల్ని ఒడి...